అనుష్క లేటెస్ట్ లుక్స్.. షాక్‌లో ఫ్యాన్స్

టాలీవుడ్‌లో లేడీ సూపర్‌స్టార్ అనిపించుకున్న నటి అనుష్క శెట్టి. సూపర్‌ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత స్వీటీకి అవకాశాలు వరుసకట్టాయి. విక్రమార్కుడు, డాన్, బిల్లా, అరుంధతి, సింగం వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో నటించి టాప్‌ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల అనుష్కకు సంబంధించిన లేటెస్ట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి. మహా శివరాత్రి సందర్భంగా అనుష్క ఓ ఈవెంట్‌లో పాల్గొంది. ఆ సమయంలో అనుష్క విపరీతంగా బరువు పెరిగిపోయినట్లు కనిపించారు. దాంతో ఆమె లుక్స్‌ చూసి స్వీటీ ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

అసలు సినిమాలు వదిలేసిందా ఏంటి అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. సాధారణంగా హీరోయిన్లు కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు విపరీతంగా లావైపోయేలా సినిమాలో కనిపించడానికి ఇష్టపడరు. క్యారెక్టర్‌ డిమాండ్ చేస్తున్నా కూడా తమ ఫిట్‌నెస్‌పై రాజీపడటానికి ఇష్టపడరు. కానీ అనుష్క మాత్రం క్యారెక్టర్‌ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తా అనేలా సైజ్‌ జీరో సినిమా కోసం విపరీతంగా లావైపోయారు. ప్రకాశ్ కోవెలమూడి తెరకెక్కించిన ఈ సినిమాలో అనుష్కకు జోడీగా ఆర్య నటించారు. ఈ సినిమాలో అనుష్క చాలా బొద్దుగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత అనుష్క కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్‌గా బాహుబలిలో నటించే అవకాశం వచ్చింది. దర్శకధీరుడు ఎస్.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1, 2 సినిమాల్లో అనుష్క దేవసేన పాత్రలో అదరగొట్టింది. ఈ సినిమా కోసం ఆమె చాలా బరువు తగ్గింది కూడా. ఇదివరకటి అందంతో మరోసారి ప్రేక్షకులను అలరించింది.

 

ఈ సినిమా తర్వాత యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వచ్చిన భాగమతి సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది అనుష్క. అరుంధతి తర్వాత స్వీటీ కెరీర్‌లో అంతటి స్థాయిలో బ్లాక్‌ బస్టర్ విజయం అందుకున్న సినిమాగా నిలిచింది. ఆ తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకుని నిశ్శబ్ధం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో మూగ అమ్మాయిగా మరో ఛాలెంజింగ్ పాత్రలో నటించి మళ్లీ తానేంటో నిరూపించుకుంది. ఆ తర్వాత నుంచి అనుష్క బిగ్ స్క్రీన్‌కు కాస్త దూరంగా ఉంది. అయితే మొన్న శివరాత్రికి ఓ ఈవెంట్‌లో కనిపించిన అనుష్క సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇందుకు కారణం ఆమె లుక్సే. బాగా లావైపోయినట్లు కనిపిస్తుంటడంతో స్వీటీ ఫ్యాన్స్ నిరాశచెందుతున్నారు. సైజ్‌ జీరో సినిమా వల్లే ఆమెకు అనారోగ్య సమస్యలు వచ్చి మళ్లీ ఇలా లావైపోయారని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆమె స్వతహాగా యోగా టీచర్‌ అని తన శరీరాన్ని ఎలా ఫిట్‌గా ఉంచుకోవాలో తనకు బాగా తెలుసని మరికొందరు స్వీటీ శెట్టికి సపోర్ట్‌ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అనుష్క దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై మెరవనుంది. పి. మహేశ్‌ బాబు తెరకెక్కిస్తున్న సినిమాలో అనుష్క నటిస్తోంది. ఇందులో నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమాలో అనుష్కకు సంబంధించిన ఓ లుక్ కూడా రిలీజ్ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *