ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. మెగాస్టార్ ఫిదా!

మనిషి ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా ఫొటోలు, వీడియోలు తీస్తూ చోద్యం చూస్తున్న నేటి సమాజంలోనూ ఇంకా మానవత్వం మిగిలి ఉందని చెప్పే సంఘటన హైదరాబాద్​లో చోటు చేసుకుంది. సకాలంలో స్పందించి గుండెపోటుకి గురైన ఓ వాహనదారుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్‌పై అన్నివర్గాల ప్రజలు, అధికారులు, ప్రభుత్వ నేతలు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సీపీఆర్​తో తప్పిన ప్రమాదం..

హైదరాబాద్ రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలో కానిస్టేబుల్ రాజశేఖర్ విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ వాహనదారుడు గుండెపోటుకు గురయ్యారు. ఆయన విషమ పరిస్థితిని గమనించిన రాజశేఖర్ వెంటనే గుండెపై బలంగా తన చేతులతో ఒత్తి.. శ్వాస అందేలా సీపీఆర్ పద్దతి ద్వారా ప్రయాణికుడి ప్రాణాలు కాపాడారు. ప్రయాణికుడు తేరుకొన్న తర్వాత వెంటనే ఆస్పత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  ప్రముఖులంతా కానిస్టేబుల్​ రాజశేఖర్​ను మెచ్చుకుంటున్నారు.

మంత్రి హరీష్ రావు ప్రశంసలు..

సోషల్​మీడియా వేదికగా కానిస్టేబుల్ రాజశేఖర్ మానవత్వాన్ని మంత్రి హరీష్ రావు కొనియాడారు.  రాజశేఖర్ చూపిన చొరవ, మానవత్వం వెలకట్టలేనిదని ప్రశంసించారు. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి సీపీఆర్ పద్దతిపై అవగాహన కల్పించేలా ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తుందని హరీష్ రావు తెలిపారు.

ప్రశంసించిన డీజీపీ..

తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్​  కూడా రాజశేఖర్​ను ప్రశంసిస్తూ ట్వీట్​ చేశారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ సకాలంలో స్పందించి… వాహనదారుడికి సీపీఆర్ పద్దతిలో ప్రాథమిక చికిత్సను అందించారు ఆయన మానవత్వానికి, ధైర్య సాహసాలను ప్రశంసించలేకుండా ఉండలేకపోతున్నాం అని అన్నారు.

మెచ్చుకున్న మెగాస్టార్​..

డీజీపీ పోస్టును చిరంజీవి రీ ట్వీట్ చేస్తూ.. ‘సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ రాజశేఖర్‌కు నా సెల్యూట్. సకాలంలో స్పందించి.. సీపీఆర్ పద్దతిలో మనిషి ప్రాణాలు కాపాడటం నిజంగా గొప్ప విషయం. విధి నిర్వాహణకు మించి రాజశేఖర్ తన బాధ్యతను గుర్తు చేసుకొన్నారు. సాటి మనిషి కోసం చూపిన మానవత్వం కదిలిచింది. ఫ్రెండ్లీ పోలీస్ అనే విషయానికి సాక్ష్యంగా నిలిచింది’ అని ట్వీట్‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *