మెగా హీరోలతో చిందేయనున్న ‘ధమాకా’ భామ

పవర్​స్టార్​ పవన్ కళ్యాణ్ – సుప్రీమ్​ హీరో సాయి ధరమ్ తేజ్​ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్​ హిట్​ ఫిలింగా నిలిచిన ‘వినోదయ సీతం’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మాతగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో పెళ్లిసందD ఫేమ్​ శ్రీలీల ఛాన్స్​ కొట్టేసిందని తెలుస్తోంది.

తమిళంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు, నటుడు సముద్రఖని ఈ రీమేక్ ను రూపొందిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఒరిజినల్​ సినిమాకి కొన్ని సొబగులద్ది తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. తమిళం నుండి కేవలం స్టోరీ లైన్ ని తీసుకొని మొత్తం మార్చేసి సరికొత్త కథ ఈ చిత్రాన్ని మలిచారు డైరెక్టర్ త్రివిక్రమ్. అంతేకాదు ఈ సినిమాకి మాటలు, స్క్రీన్​ప్లే కూడా అందిస్తున్నారు.

ఇక ఈ చిత్రం లో హీరోయిన్స్ గా కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు. పవన్​ కల్యాణ్​ ఇమేజ్​కి తగినట్లు పాటలు, ఫైట్స్, ఎలివేషన్స్ మిస్​ అవ్వకుండా ఉండేలా స్క్రిప్ట్ ని సిద్ధం చేశారట. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మధ్య ఊర మాస్ సాంగ్ ప్లాన్​ చేశారని తెలుస్తోంది. ఈ ప్రత్యేక పాటలో ఇద్దరు మెగా హీరోలతో చిందేసే అవకాశాన్ని క్రేజీ బ్యూటీ శ్రీలీల కొట్టేసిందని టాక్​. అంతేకాదు ఈ పాట కోసం నిర్మాతలు ఆమెకి భారీ మొత్తం రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల చేసే ప్రత్యేక సాంగ్​ హైలెట్​గా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. ఇదే బ్యానర్లో తెరకెక్కిన ధమాకా సినిమాలో మాస్​ మహరాజా రవితేజ సరసన నటించింది శ్రీలీల. త్రివిక్రమ్.. మహేష్ తో చేస్తున్న మూవీలో కూడా శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

సాయి ధరమ్​ తేజ్​ యాక్సిడెంట్​ తర్వాత చేస్తున్న సినిమా కావడం, పవన్​ కల్యాణ్​ కీలక పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  మామ‌‌, అల్లుళ్లు మొదటిసారిగా కలిసి తెరపై కనపడనుండడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. చిత్ర లహరి, రిపబ్లిక్​ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఈ సినిమాపైనే తేజ్​ ఆశలు పెట్టుకున్నాడు.

ఇక, ఒక పక్క క్రిష్​ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తూనే మరో పక్క మూడు సినిమాలకు కొబ్బరి కాయ కొట్టేసాడు పవన్ కళ్యాణ్. ఒకటి సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కబోతున్న #OG చిత్రం కాగా, మరొకటి హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’. వినోదయ సీతం సినిమా షూటింగ్​ కూడా పట్టాలెక్కేసింది. వరుస సినిమాలతో ఈ ఏడాది పవన్​స్టార్​ అభిమానులకు పండగే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *